National Childrens Day | పాలకుల నిర్లక్ష్యం వల్లే ఎస్సీ, ఎస్టీలు విద్యకు దూరమయ్యారు
National Childrens Day | పాలకుల నిర్లక్ష్యం వల్లే ఎస్సీ, ఎస్టీలు విద్యకు దూరమయ్యారు
రాష్ట్రంలో 21 సంవత్సరాలకే ఎన్నికల్లో పోటీకి ఛాన్స్
అసెంబ్లీలో తీర్మానం తీసుకువస్తాం
విద్యాభివ్రుద్ధి కోసం రూ.21 కోట్లు కేటాయించాం
బాలల దినోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు
Hyderabad : రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం వల్లే ఎస్సీ, ఎస్టీకి చెందిన విద్యార్థులు విద్యకు దూరమయ్యారు అని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. అలాగే రాష్ట్రంలో 21 సంవత్సరాలు నిండిన యువత ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కల్పిస్తామని తెలిపారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం తీసుకు వస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం బాలల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని బాలలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తమ చప్పట్ల మోత, గత తెలంగాణ పాలకులకు వినిపించాలని, గత పాలకులు ఏనాడైనా బాలల మధ్య ఉన్నారా ? అని, వారి సమస్యలు పరిష్కరించారా అని ప్రశ్నల వర్షం కురిపించారు. అలాగే రాష్ట్రంలో 5000 స్కూళ్లను మూసివేసిన ఘనత మాత్రం వారిదే అవుతుందని ఎద్దేవ చేశారు. రైలు ఢీకొన్న ఘటనలో వారికి ఒక్క కన్నీటి చుక్క వచ్చిందా.. రాలేదే.. అది వారికున్న లక్షణం మన్నారు. `నేనున్నా.. మీ అవసరాలు తీరుస్తా.. మీ భవిష్యత్ కు బంగారు బాటలు వేస్తా` అంటూ.. సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
విద్యార్థులారా.. వ్యసనాల బారిన పడవద్దు..
విద్యార్థులు చెడు వ్యసనాల బారిన పడి తమ బంగారు భవిష్యత్తు పాడు చేసుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు. అప్పుడే విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతారని సీఎం ఆశించారు. తల్లి దండ్రులు కలలుగన్న ఆశలను నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందని, తెలంగాణ పునర్నిర్మాణంలో నేటి బాలలే రేపటి పౌరులుగా మీ బాధ్యత అవసరమన్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యాశాఖకు రూ.21 వేల కోట్ల నిధులు కేటాయించినట్లు సీఎం అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభించిన రోజే విద్యార్థులు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. గత పాలకులు ఐదువేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలను మూసి వేస్తే.. తాము ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను సైతం భర్తీ చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిం దిశగా అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు, పేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే తమ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం తెలిపారు. మూసాయి పల్లి ప్రమాదంలో 30 మంది విద్యార్థులు మరణిస్తే, కనీసం పరామర్శించాలన్న బాధ్యత కూడా మాజీ సీఎం కేసీఆర్ కు లేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అంత పెద్ద ప్రమాదంలో విద్యార్థులు చనిపోతే స్పందించాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీకి లేదా అంటూ సీఎం సూటిగా ప్రశ్నించారు. ఏనాడైనా విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు గత పదేళ్ల పాలనలో మాజీ సీఎం కేసీఆర్ ప్రయత్నించలేదని, తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. ప్రభుత్వం అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలని, కానీ కేసీఆర్, కేటీఆర్ లకు అవేమీ పట్టవన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా తమరు కొట్టే చప్పట్లు, ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ కు వినిపించాలన్నారు. తమ ప్రభుత్వ హయాంలో విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు, దేశంలో నెహ్రూ తెచ్చిన విద్యా విప్లవాన్ని తాము తెలంగాణ వ్యాప్తంగా కొనసాగిస్తామన్నారు.
21 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం..
తెలంగాణలో 21 ఏళ్లు నిండిన ప్రతి యువకుడు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అర్హత కల్పించేలా రానున్న అసెంబ్లీ సమావేశాలలో తీర్మానం ఆమోదించనున్నట్లు విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. సాధారణంగా 25 ఏళ్ళు నిండిన వారికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంటుందని, కాని యువతను రాజకీయాల్లోకి ఆహ్వానించేందుకు తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు సీఎం అన్నారు. 18 ఏళ్లకే ఓటు హక్కు పొందుతున్న యువకులు, 21 ఏళ్లకే రాజకీయాల్లో రాణించేందుకు ఇదొక గొప్ప అవకాశంగా భావించాలన్నారు. అయితే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు తొలగించేది లేదన్నారు. కులగణనలో యావత్ దేశానికి తెలంగాణ మార్గదర్శకంగా నిలుస్తుందని, కులగణనను అడ్డుకునేందుకు పలువురు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. జనాభా ఆధారంగా రిజర్వేషన్లు రావాలంటే ఈ సర్వే తప్పనిసరని, కులగణన సర్వే ఎక్స్ రే మాత్రమే కాదని, మెగా హెల్త్ చెకప్ లా పనిచేస్తుందన్నారు. నేటి విద్యార్థులు రేపటి భవిష్యత్తు పౌరులని, తెలంగాణ పునర్నిర్మానంలో విద్యార్థులందరూ భాగస్వామ్యం కావాలంటూ సీఎం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
* * *
Leave A Comment